గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు జ్యేష్ట రమేష్ బాబు వ్రాయు బహిరంగ లేఖ
సర్,
గత రెండు దశాబ్దాలుగా మైలవరం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ తరఫున స్థానికేతరులు అభ్యర్థులుగా ఉంటూ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా బ్రష్టు పట్టించారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా ఇదే విధానాన్ని అవలంబించడం వల్ల మైలవరం నియోజకవర్గం అభివృద్ధిలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారైంది. ఎక్కడి నుండో వచ్చిన నాయకులు మైలవరం శాసనసభ్యులుగా, రాష్ట్ర మంత్రులుగా పదవులు వెలగబెడుతూ తమ స్వలాభం చూసుకుంటున్నారే తప్ప నియోజకవర్గానికి చేసిన మేలు ఏమీ లేదు. స్థానికేతరులైన ఇరు పార్టీల నాయకులు దేవినేని ఉమామహేశ్వరరావు, వసంత కృష్ణ ప్రసాద్ నియోజకవర్గ అభివృద్ధిని పట్టించుకోకుండా ఒకరిపై ఒకరు అసభ్యకరంగా, కుటుంబ పరంగా, మహిళలని కూడా చూడకుండా దూషించుకుంటూ అభివృద్ధిని విస్మరించి నియోజకవర్గ ప్రజల మధ్య విద్వేషపూరిత వాతావరణాన్ని కల్పించారు. పైకి విమర్శించుకుంటూ ప్రజలను మభ్యపెడుతున్నారు. వాస్తవానికి మైలవరం నియోజకవర్గం లోని సహజ వనరులను ఎదేచ్చగా, విచ్చలవిడిగా దోచుకుంటూ దోపిడీలో ప్రచ్చన్న భాగస్వాములుగా కొనసాగుతున్న విషయం నియోజకవర్గంలోని ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. మద్యం, క్వారీలు, మట్టి తవ్వకాలు, వీటిపిఎస్ బూడిద, ఇసుక, గ్రావెల్, పోలవరం కాలువ మట్టి, అడవులతో సహా ప్రకృతి వనరులన్నింటినీ ఇరువురు నాయకులు దోపిడీ చేసిన విషయం జగమెరిగిన సత్యం. దేవినేని ఉమామహేశ్వరరావు రాష్ట్ర మంత్రిగా ఉన్న సమయంలోనూ, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా కేవలం వార్తాపత్రికలకు, మీడియా చానళ్లకు మాత్రమే పరిమితమై క్షేత్రస్థాయిలో నాయకులకు, కార్యకర్తలకు అందుబాటులో లేకుండా పార్టీని పూర్తిగా నిర్వీర్యం చేశారు. ఆయనతో ఉండే ఒకరిద్దరు లాభపడ్డారేమోగానీ దేవినేని ఉమా విధానం వల్ల నియోజకవర్గంలోని నిబద్ధత కలిగిన నాయకులు, కార్యకర్తలు అందరూ ఆర్థికంగా, రాజకీయంగా పూర్తిస్థాయిలో నష్టపోయారు. అయినా పొరుగు నియోజకవర్గం నుండి వలస వచ్చిన ఈ నాయకుడు ఈరోజు వరకు కార్యకర్తల, ద్వితీయ శ్రేణి నాయకుల బాగోగులు పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దీనికి ప్రధాన కారణం మైలవరం ఆయన సొంత నియోజకవర్గం కాదు కాబట్టి. విభజించు పాలించు అనే బ్రిటిష్ వారి విధానాన్ని అవలంబించి నియోజకవర్గంలోని ప్రతి గ్రామ తెలుగుదేశం పార్టీని రెండు, మూడు ముక్కలుగా చీల్చిన మాజీ మంత్రి దేవినేని ఉమాని ఇంకా భరించే ఓపిక మైలవరం నియోజకవర్గ ప్రజలకే కాదు, నియోజకవర్గ తెలుగుదేశం పార్టీకి కూడా లేదనే సత్యాన్ని మీ దృష్టికి తీసుకు వస్తున్నాను. అలాగే ప్రస్తుత శాసనసభ్యుడు వసంత కృష్ణ ప్రసాద్ కూడా తన పార్టీ నాయకులకు న్యాయం చేయలేకపోయానని బహిరంగంగానే ఒప్పుకుంటున్నారు. ఎన్నికల వరకు మాత్రమే రాజకీయాలు, ఎన్నికల అనంతరం కలిసికట్టుగా నియోజకవర్గ ప్రజలకు మేలు చేయాలనే ప్రాథమిక ప్రజాస్వామ్య సూత్రాన్ని మరిచి ఒకరిపై ఒకరు తిట్టుకుంటున్నట్లు నటిస్తూ ప్రజలను మోసం చేస్తున్నారు. ఇప్పటికైనా మీరు సత్యాన్ని గ్రహించి సీనియర్ నేతగా, తెలుగుదేశం పార్టీ అధినేతగా ఆలోచించి సరైన నిర్ణయం తీసుకొని తెలుగుదేశం పార్టీకి చెందిన స్థానిక నాయకునికే పార్టీ టిక్కెట్టు కేటాయించాలని కోరుకుంటున్నాను. నిజాయితీతో, నిబద్ధతతో దశాబ్దాల తరబడి తెలుగుదేశం పార్టీకి సేవ చేస్తున్న అనేకమంది నాయకులు నియోజకవర్గం లో ఉన్నారు. వారిలో ఎవరికి సీటు కేటాయించినా గెలిపించుకునే సత్తా ఉన్న కార్యకర్తలు పార్టీలో ఉన్నారు. వలస రాజకీయ నాయకుల బారీ నుండి మైలవరం నియోజకవర్గానికి విముక్తి కలిగించి, స్థానిక నాయకత్వాన్ని ప్రోత్సహించవలసిన బాధ్యత ఒక విజనరీ లీడర్ గా మీ మీద ఉందని తెలియజేసుకుంటున్నాను. కాబట్టి స్థానిక నాయకుడిని తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ప్రకటించి మైలవరం నియోజకవర్గ ప్రజల ఆకాంక్షలను, ఆత్మ గౌరవాన్ని కాపాడవలసినదిగా మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను.
ఇట్లు
జ్యేష్ఠ రమేష్ బాబు, మాజీ శాసనసభ్యులు మైలవరం, నియోజకవర్గం, ఎన్టీఆర్ జిల్లా.
ఫోన్: 9676721111.